రాకూడదా యేం?!
యింకా రావేం!
సమయం మించిపోతోందని నీకనిపించలేదా?
యిన్ని ఉదయాలు
యిన్ని కడగండ్లు
యిన్ని నవ్వులూ
యిన్ని ఏడ్పులూ నువ్వు లేకుండానా?!
నీకనిపించలేదా!
మన సమాగమ సాయంత్రాలూ వృథాగా పోతున్నాయని
మన హౄదయాలకు దూరం పెరిగిందని
మన అభిప్రాయాలకు హక్కులు పెరిగాయని
నువ్వు వెళ్ళిపోతేనేం?యిక్కడేమీ మారలేదు.
అంతా అట్లాగే వుంది.అద్దంపై నువ్ చేసిన మరకలు,
మంచానికి ఆవల విసిరేసిన దిండు,
నువ్వు విసురుగా వెళ్ళినపుడు నీ జళ్ళోంచి రాలిన పువ్వు
నువ్వు గిరాటేసిన నా కానుక
నా పెదవిపై నువ్ చేసిన గాయం
అన్నీ అట్లాగే వున్నాయ్!
యింకా రావేం?
మన జీవితాలు యాంత్రిక ఛట్రంలో చిక్కుకుని
సొమ్మసిల్లకముందే
నిన్ను అలంకరించిన నవ్వు అలసట చెందకముందే
మన హౄదయాలు జీవితపు ఆవలి తీరాల్నిప్రేమించకముందే...
రాకూడదా యేం?
4 Comentários:
అద్భుతం గా వుందండి.నిజమే ఎవరికివారు వేరయిపోయినా ఏమీ మారదు.నువ్వు లేకుండా బ్రతకలేను అనుకొన్నవాళ్ళమే వాళ్ళ తలపు కూడా లేకుండా గడిపేయగలము [యాంత్రికంగా].కానీ తిట్టుకున్నా,తగవు పెట్టుకున్నా కలిసుంటే ఎన్నో అందమయిన అనుభవాలు మూటకట్టుకోవచ్చు. ఎవరున్నా లేకపోయినా ఏమీ ఆగదు.జీవితం సాగుతూనే వుంటుంది.కానీ ఒకరికొకరు తోడుంటే అలుపుండదు.ప్రయాణం లో విసుగుండదు.
"మన అభిప్రాయాలకు హక్కులు పెరిగాయని" ఈ లైను అయితే నాకు చాలా నచ్చింది.
నువ్వొస్తానంటే నేనొద్దంటానా!
"మన హౄదయాలు జీవితపు ఆవలి తీరాల్నిప్రేమించకముందే" .. చాలా లోతైన మాటలు..
కవిత బాగుంది.
i can't say more except 'amazing'!!!
Post a Comment