చలం కలం లోంచి రవీంద్రుని గీతాలు
నీకు బాధంటే అసలు తెలీనే తెలీదేమోనని...
నాలోని లోతైన మాటల్ని నీతో చెప్పాలని వేదన పడతాను.
నువ్వు నవ్వుతావేమోనని భయం.
అందుకని నన్ను చూసి నేనే నవ్వుకుని
నా రహస్యాన్ని పరిహాసంలో వెదచల్లేస్తాను.
నా బాధని నువ్వు తేలిక చేస్తావేమోనని నేనే తేలిక చేసుకుంటాను.
నీతో చెప్పాలనుకున్న అసలు నిజమైన మాటల్ని
నీకు చెప్పాలని వాంఛిస్తాను.
కాని వాటిని నమ్మవేమోనని వూరుకుంటాను.
అందుకనే నేను అనుకున్న దానికి విరుద్దంగా
మాట్లాడి వాటిని అనృతంలో దాస్తాను.
నా ఆవేదనని నువ్వు హేళన చేస్తావేమోనని
నేను దాన్ని అర్థం లేకుండా మారుస్తాను.
నీకోసం నాలో వున్న విలువైన మాటల్ని పలుకుదామని
ఆశ పడతాను. కాని నువు వాటికి సరైన విలువనివ్వవని
భయపడి వూరుకుంటాను. అందుకనే నీకు
కఠినమైన పేర్లు పెట్టి మార్దవం లేని
కర్కశురాలివని ప్రగల్భాలు పలుకుతాను
నీకు బాధంటే అసలు తెలీనే తెలీదేమోనని నిన్ను గాయం చేస్తాను.
నీ పక్కనే నిశ్శబ్దంగా కూచోవాలని , వాంఛిస్తాను.
కాని నా పెదవుల్లోంచి నా హృదయం బయలు పడుతుందేమోనని
అధైర్యపడతాను. నా వేదనని మొరటుగా వాడతాను.
నువ్వే అట్లా చేస్తావేమోనని వెరచి
నేను నీనించి దూరంగా పోదామనుకుంటాను.
కాని నాకాధైర్యం లేదు. నా పిరికితనం నీకు
తెలిసిపోతుందేమోనని భయం .
అందుకనే నా తలని ఠీవిగా పైకెత్తి, నిర్లక్ష్యంగా నీ సమక్షానికి వొస్తాను.
నీ కళ్ళనించి అంతులేని ఘాతాలు నా గాయాల్ని మాననీవు-
2 Comentários:
వావ్
woww
Post a Comment