Tuesday, November 6, 2007

మానవతావాది చలం


చలం మానవతావాది అనే విషయంలో సందేహం అవసరం లేదు. లేకపోతే, అనాధపిల్లల్ని, కని అఖ్ఖర్లేదని పారేసే పిల్లల్ని, వితంతువుల్ని, అభాగ్యుల్ని, బాలవితంతువుల్ని చేరదీసి తనకే, రోజుల్ని , వెళ్లదీయటం కష్టంగా వున్నరోజుల్లో కూడా యింట్లో ఆశ్రయమిచ్చేవాడు.


ఆంధ్రదేశం వెలివేస్తే అడవిలో గోదారి పక్కన కుటీరంలో (పాడుబడిన యింట్లో) భార్యాపిల్లల్తో ఏ, ఆక్రోశమూ అవేదనా (మనుషులపైన) లేక ప్రకృతితో కలిసి మమేకమై జీవించాడు. ఆనందమే పరమావధిగా బ్రతికాడు. అతని కౌమారమంతా నవ్వుల్తో ,కలల్తో , వొయ్యు వొయ్యారాల్తో , మాత్రమే గడిచింది. మనుషుల బ్రతుకుల్లోని అసహ్యాన్నీ, నీచాన్నీ, తన పేదరికాన్నీ అన్నిటినీ అంత చిన్న వయస్సులోనే క్షమించగలిగిన మహొన్నతుడాయన.


రమణమహర్షి దేహం విడిచాక అందరూ మూటలు సర్దుకుని వెళ్లిపోతూ 'నువ్విక్కడెందు’ కని అడిగితే 'నా స్థలమిదే ' అని చెప్పేంత నిబద్దత ఒక్క చలానికే గాక యింకెవరికుంది. తన కొడుకు వసంత్ ఎక్కడో పరాయి రాష్ట్రంలో చదువుతున్నప్పుడు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ చలాన్ని పిలిచి ' మీ వాడు అసాధారణ మనిషి. అతన్ని పెంచిన వ్యక్తి యెలా వుంటాడో చూడాలని పిలిపించాన ' న్నాడు. గోదారిలో పిల్లల్తో ఈతలు కొడుతో చెట్లూ చేమల్లో ఆడుకుంటో, వచ్చే డబ్బుచాలక కొన్నిసార్లు చింతపండు పులుసుతో కడుపు నింపుకుంటో , పిల్లల్ని గనక ఆ అడవిలో పెంచినట్లయితే నిజానికి వీళ్లు యే సంస్కారమూ, లోకజ్ఙానం అబ్బక మూఢులై, అజ్ఙానులై పనికిరాకుండా పోయేవాళ్లు. కాని చలం, ప్రపంచానికి శౌ లాంటి వో గొప్ప జ్ఙానినీ, ఆధ్యాత్మిక మార్గదర్శినీ అందించగలిగాడంటే చలం అసాధారణ మనిషి !


సౌందర్యాన్ని చూసి జీవితమంతా యీ జ్ఙాపకంతో బాధపడేగతిని తప్పించుకున్న వాళ్లను తలచుకుని యీర్ష్యపడుతో , జరగడానికి వీలు లేని దివ్యసన్నివేశాలు తన జీవితంలో జరుగుతాయని (అది ఖచ్చితంగా భగవాన్ అయి వుండాలి) కలలు కంటో వెళ్లిపోయాడు. వ్యక్తి స్వేఛ్చకు గొప్ప నిర్వచనం చలం. సౌందర్యోపాసనకు సుధామధుర వ్యాఖ్యానం చలం . రవీంద్రుని గీతాలు (ఫలసేకరణ, వనమాలి, గీతాంజలి ), రుబాయత్ లు చలం తెలుగు చేయటం వల్లే అవి అంత అందాన్నీ , అమరత్వాన్నీ సంతరించుకున్నాయేమో. చలం తన కుటుంబాన్ని పట్టించుకోలేదన్న ఆరోపణ బహుశా ఆయన విశ్వ మానవుడై , జగాన్నే కుటుంబంగా చూసిన వాడు కావడం చేత వీగిపోతుందేమో !


వూహ తెలిసింది మొదలు చచ్చేవరకు నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా చెప్పిన వాడు చలం వొక్కడే ( ఫ్రాయిడ్ భాషలో ఇడ్ వున్న మనిషి చలం వొక్కడే కావొచ్చు.)


మానవత్వమూ మహా కాముకత్వమూ ఒకే ఒరలో ఎట్లా ఒరుగుతాయో? రెంటినీ ఒకే మనిషిగా కలిపి చూడగలిగితే అది చలం కాక యింకెవ్వరూ కాలేరు!!


ఆడదాని కళ్లల్లో తను చూసే ప్రేమా మాధుర్యమూ వుత్త మిధ్య అనీ, అవన్నీ తన మనస్సు కల్పించుకునే మాయ అని, భగవాన్ దీక్షలో, శరీరాన్నీ మనస్సునీ కృశింపజేసి తనను ప్రజ్వలింపజేసే ఆనందం ఆత్మ సాక్షాత్కారం ద్వారా పొందగలిగితే ఆడపిల్లలే అఖ్ఖర్లేదనీ భగవన్నామంలో కృంగి, కృశించి, నశించి


'మూడు మూళ్లా బావిలోనా

ఆరు మూళ్లా చాపవొకటి

మూలమెరిగి గాలమెయ్యరా

దీని భావము నీకు తెలుసురా? '

అంటో


మూలమెరిగి గాలమేసే సమయానికే చలాన్ని ఒంటరిని చేసి వెళ్లిపోయాడు భగవాన్.

నా జీవితంలో అసంభవమనుకున్న దివ్యమైన కల నిజమైందని

సంతృప్తిగా తనూ వెళ్లిపోయాడు చలం.

4 Comentários:

రాధిక said...

good one.

Unknown said...

చలం శైలి నాకు చాలా నచ్చుతుంది. మీలానే చరిత్ర అన్నా, చలం అన్నా చాలా అభిమానం నాకు,తేడా అల్లా మన దృక్పథాలే! ఇంకా రాయండి

Anonymous said...

chalam navalalu konni, inka ayana rasina musings chadivanu. Tana navalala loni patrala dwara, em cheppadalachukunnadu anedi nakippatiki spashtamga arthamkaledu. Prema, vivaham gurinchi ayana emanukuntunnranedi nenu telusukolekapoyanu. Bahusa inka chadivithe telusukogalanemo

sree said...

Na life Chalam Kathalloni okati...
nija jeevitamlo chalam heroien evaru Adarincharu anedaniki na life oka udaharana...

SREE

Post a Comment

  ©THE iNSIDER. Template by Dicas Blogger.

TOPO