Wednesday, October 10, 2007

మా తాతయ్య చలం - ఓ మనవరాలి అంతరంగం

దేశం పట్టనంత పేరున్న రచయిత గురించి లోకానికి తెలియని విషయాలను వారితో చెట్టపట్టాల్ పట్టుకొని తిరిగిన వారు చెబితే, నిజంగానే ఆసక్తికరంగా ఉంటుంది. తండ్రో, తాతో రచయిత అయితే ఆయన పుస్తకాలను ప్రచురించడం తన కర్తవ్యంగా భావించి ఆ పనిచేస్తే వారిపట్ల కర్తవ్యాన్ని నెరవేర్చిన వారవుతారు. విశ్వనాథ పట్ల విశ్వనాథ పావనిశస్త్రి, నాయని సుబ్బారావు పట్ల నాయని కృష్ణకుమారి, దేవులపల్లి పట్ల ఆయన సంతానం. ఇలా ఎందరో ఈ విద్యుక్త ధర్మాన్ని నేరవేర్చినవారే. అయితే చలం మీద చలం గురించి ఏ సభ జరిగినా అక్కడ ప్రత్యక్షమయ్యే సీనియర్ రచయిత్రి తురగా జానకిరాణి చలం గురించి, ఆయన రచనల గురించి ఏవేవో విషయాలు ముచ్చటిస్తుంటే చలం అభిమానులు ఆసక్తి ప్రదర్శించిన మాట వాస్తవం. అయితే ఆమె అభిమానుల్ని ఉత్సాహపరిచే ముచ్చట్లతో పాటు, కొంత నిరుత్సాహానికి గురిచేసే విషయాలు చెబుతున్నారు. 'మా తాతయ్య చలం' పేరుతో ఆమె పంచుకొంటోన్న సంగతులు కొన్ని విందాం.

1. చలం నన్ను ఒక రచయిత్రి గా చూడలేదు. నాకు చాలా భయం. ఆయనకి నేను వ్రాసినవి చూపాలంటే.

2. మనుషులతో గెట్ ఆన్ కావడం మంచిదే. కాని వాళ్లతో గెట్ ఆన్ కావడం కోసం, మన స్వతంత్ర్యాన్ని, మన కన్విక్షన్స్ ని వొదులుకోవడం, కాంప్రమైజ్ కావడం సూసైడల్. వాళ్ల మీది ప్రేమ వల్ల వొదులుకో. (నిజమైన ప్రేమకన్న గొప్పది లేదు) వాళ్లకి జడిసి కాదు. వాళ్లిచ్చే స్నేహానికీ, షాలో అఫెక్షన్ కీ, వాళ్ల వర్త్ నే కాదు. వొంటరిగా నుంచోడానికి జడిసి కాదు. వాళ్లని ప్రేమించు. లొంగిపోకు.

3. నువ్వు శృంగార రచనలు చేశావు. స్త్రీ, పురుష సంబంధాలను గురించి విప్లవాత్మకంగా , ఎంతో పచ్చిగా రాశావు. మరి యిప్పుడు యీ యోగి పాత్ర ఏమిటి? అని చాలాసార్లు అనేదాన్ని. ‘నా వయసు పొగరు అది. ధైర్యంగా ఎవరితో పడితే వారితో, తోచినవి అనేయడం అలవాటున్న రోజులు. నా రొమాన్సు అనేది నా రక్తంలో కలిసి నాతోనే పుట్టింది. ఎంత ప్రయత్నించినా శృంగార వాంఛను యీ నాటికీ జయించలేకపోయినాను. అదే లేకపోతే నేనెందుకు బ్రతికీ?... స్త్రీతో కొన్నేళ్లు స్నేహమైతే, నాలోని శృంగార భావం పాతబడి, ఇంక నన్ను ఆకర్షించడం మానేసేది. అప్పుడు యింకొక ప్రేమకాదు. ఉత్త కామమూ కాదు. పసితనం నుంచి, నాకు అన్నేళ్లు గా ఆ వాంఛలు వుంటూనే వుండేవి’.

4. నీ పుస్తకాల వల్ల ఎందరో పాడైపోయారు అంటారు, ఎందుకట్లా రాశావు? అని అడిగాను. 'అట్లా అనిపించింది. రాశానూ అన్నారాయన. 'మరి యుప్పుడు యిల్లా ఈశ్వరుడు అంటూ భజన చేస్తున్నావేం?' అన్నాను. 'ఇప్పుడిట్లా అనిపిస్తోందీ అన్నారు. ఇంకా ఏం మాట్లాడానో గుర్తు లేదు. అప్పుడాయన నన్ను దగ్గరకు తీసుకొన్నారు. ఒక స్త్రీ ని పురుషుని వలె ముద్దు పెట్టుకున్నారు. అప్పుడు నేను ఆయనకు మనవరాలిని కాదు, అందమైన ఆడపిల్లని- అని యిప్పుడు అనిపిస్తోంది.

5. ఒక కొడుకు రవి చిన్నవాడు చనిపోయినా, మరొక అబ్బాయి వసంత్ (సంతి), కనబడకుండా మాయమైపోయినా, ఆడపిల్లలు ముగ్గురు సంప్రదాయమైన గృహిణులుగా స్థిరపడలేకపోయినా, భార్య మనస్సు విరిగి ఎన్నో ఏళ్లు కాషాయబట్టలు కట్టుకుని వూర్లూ తిరిగినా-వాటికిబాధ్యత తనదే అని అనుకున్నా-బయటికి చెప్పని వ్యక్తి ఆయన. లోకరివాజుగా చూస్తే ఇవన్నీ బాధ్యత లేనిపనులే. స్త్రీ-బిడ్డల పెంపకం వంటి అంశాలపైన ఆయన సలహాలు, అభిప్రాయాలు, 70ఏళ్లనాడు ఎంత ఆధునికమో! ఆయనలోని ఉదారతకు, పరిమళించే మానవత్వానికి, మధురమైన మాతృత్వానికి సంబంధించిన భావాలకు ఆయన రచనలు ఎంత గొప్ప పుష్టి నిచ్చాయో గమనిస్తే-వ్యక్తిగత జీవితంలో యివన్నీ ఎందుకు ఆచరించలేదు-ఒక భర్తగా, తండిగా, కొడుకుగా ఎందుకు విఫలమైనాడు అనే ప్రశ్న వస్తుంది. కాని అలా అనే హక్కు మనకు లేదేమో!

6. ఆయన బాధ్యత లేని పేరెంటు అని, భర్త అనీ నేను నమ్మడమే కాక, కొంత సూటిపోటిగా ఆ మాటలు అనేదాన్ని.

7. ఆయనను ఆలంబనగా చేసుకున్నవారి జీవితాలకు ఆయన లౌకికమైన అభ్యుదయం సమకూర్చడానికి ప్రయత్నించలేదు.

8. చలాన్ని తలుచుకుంటే-కనీసమైన అవసరాలు కూడా పట్టించుకోని యోగిగా, భావాల మధనంలో హాలాహలం తన గొంతులో దాచుకున్న శివమూత్రి స్ఫూర్తిగా స్ఫురిస్తారు. తను వ్రాసిన ప్రతి మాటనూ నమ్మి, తననే ఆరాధిస్తూ తమ మానసిక ప్రణయ సంబంధ, వివాహ విచ్చేద సంబంధమైన చిక్కులను గురించి చెప్పుకునేవారికీ, తన విలువైన కాలాన్ని వెచ్చించారు. ఎంతో దూరాల నుంచి తనను చూడవచ్చిన వారికి రోజుల తరబడి ప్రేమగా అన్నం పెట్టారంటే ఆయనకి ప్రణమిల్లాలి. తనకి వున్నా లేకపోయునా పెద్ద సంసారానికి ఆశ్రయమిచ్చారు. అదొక ప్రత్యేకమైన వాతావరణం. పరస్పర గౌరవం, మనుష్యులుగా ప్రతివారినీ అంతస్తులు మరచి ఆదరించిన ఉదారాశ్రమం.

9. తల్లిని పోషించని మనిషిగా నేను చలాన్ని పేర్కొనడం బావ్యం కాదు. తన భార్యని పిల్లలతో ఎగతాళి చేయించి, కొట్టించిన 'వికృత వ్యక్తిత్వం' గా ఆయన్ని పేర్కొనడమూ భావ్యం కాకపోవచ్చును. యుక్త వయస్కులైన ఏకైక కుమారుడు ఆనాటి బెజవాడ నుంచి తెలుగు సమాజంలో యిమిడిపోలేక, యిల్లు విడిచి అంతర్దానమైపోవడానికి ఆయనే కారకుడని (అంటే చలం) కోపంగా అనడమూ సబబు కాకపోవచ్చును.

10. ప్రశ్నలు వేయకుండా, సమాధానాల కోసం అన్వేషించకుండా 'జై జై చలం' అని జే కొట్టే వారి కృత్రిమత్వాన్ని, చిత్తశుద్ది నీ శంకిస్తాను. నా తగాదా వారితోనే.

11. చలాన్ని చదవడం ఫ్యాషను, చలంలాగ చంచలత్వం యింకా ఫ్యాషను. వ్యక్తి స్వేచ్చకు గొప్ప నిర్వచనం చలం. సౌందర్యోపాసనకు సుధామధుర వ్యాఖ్యానం చలం. అది సరేగానీ, ఆయనలాగ బ్రతికేస్తామనీ , తమ కుటుంబ స్త్రీలను బతకనిస్తామని, ప్రోత్సహిస్తామనీ ఎందుకు వేదికల మీద ఎవరూ చెప్పరూ? చలం సంస్మరణ అధ్యయన సభలకు తమ భార్యలను వెంటబెట్టుకొని వచ్చేవారు ఎంతమంది?

12. ఓసారి మాలతీ చందూర్ చెప్పారు-'చలం శత జయంతి చేస్తున్నాం, రమ్మని మదరాసులో పిలిస్తే, 'మా నాన్నంటే మాకు అసహ్యం , మేము రాము’ అని ఆయన కూతుళ్లిద్దరూ అన్నారని. ఇవన్నీ ఏకరవు పెడుతూ చలాన్ని బాధ్యతారహితుడిగా, పిల్లల ప్రేమను కూడా కోల్పోయిన ఒంటరిగాడిగా చిత్రించాలని కాదు నా ఉద్దేశం. ఈ వాస్తవాలను పరిశీలించుకొని, చలం రచయితగా ఎందుకు గొప్పవాడో అందుకు ఆయనకు గుడి కట్టండి. ఒకసారి తేనెలోను, ఒకసారి విషంలోను ముంచిరాసిన ఆయన కలాన్ని జన్మజన్మలకు పూజించండి. మహా వాఙ్మయకర్తగా, ఎన్నో ప్రక్రియలకి నాంది పలికిన వైతాళికునిగా, వ్యక్తి స్వేఛ్చను ప్రతిపాదించిన సంస్కర్తగా వేనోళ్ల పొగడండి. కానీ సాధించలేకపోయిన వాటికీ, ఆయనే చెప్పుకున్న ఆయన వైఫల్యాలకీ కూడా మీ పరిశీలనల్లో చోటివ్వండి.

13. చలాన్ని ఎందుకు చదవమని అంటున్నామో ఆ విషయంలో స్పష్టత కావాలి.

14. ఆయన బోధించిన 'కాముక స్వేఛ్చ’ నాకు పరమరోత కలిగించింది. అది మానవస్థాయి నుంచి పశుస్థాయికి దిగడం అని నా చిన్న బుర్రకు తోచింది.

15. ఏ సంస్కరణ అయినా, ఏ విప్లవాత్మక పరిణామమైనా వ్యక్తికి, ఆ తర్వాత సమాజానికి లాభం, సుఖం, ప్రగతి చేకూర్చాలని నా అభిప్రాయం. ఆలోచనా ధోరణిని ప్రేరేపించడం, ఒక కొత్త మలుపుని తిప్పడం, లేచి, సుడిగాలిలా విజృంభించడం, చుట్టు ముట్టడం అన్నీ అర్థం చేసుకోవచ్చును. వాటి ఉద్దృతం, అవి కలిగించిన తొలి మైకం తగ్గాక, ఆలోచన స్పష్టంగా సాగాలిగా?

16. తురగా జానకీ రాణి ఏ సంచలనంకోసమో ఇవన్నీ చెప్పడం లేదు. అరవై ఏడేళ్ల వయసులో ఎప్పట్నించో గొంతు విప్పి చెప్పాలనుకొన్న వాటిని ఆమె అణచుకోలేక చెప్పారు. ఇందువల్ల చలం మన ముందు తరాలకి ఇంకా స్పష్టంగా కనిపిస్తాడని ఆమె విశ్వాసం.

3 Comentários:

madhu said...

జీవితాన్ని తాము నమ్మిన లక్ష్యానికి అంకితం చేసిన వారు వ్యక్తి గతంగా, కుటుంబాన్ని సంతృప్తి పరచలేరు.అది ఎవరి విషయం లోనైనా అంతే.
గాంధి లాంటి వారి కుటుంభ సభ్యులైనా ఈ విషయం లో అతీతులు కారు, వారు గాంధి కి వ్యతిరేకంగా చెప్పినా గాంధి చెడ్డవాడని మనం అనుకోగలమా?.
కాకపోతే చలం సమాజానికి వ్యతిరేకంగా వున్నాడు కాబట్టి, దాని ప్రభావం కుటుంభాన్ని బలి తీసుకుంది.
నిజంగా చలం డబ్బు ఆస్తులు దాచి, తనకుటుంభాన్ని ఓ లాగా ,సమాజాన్ని ఓ లాగా చూస్తే అలాంటి చలాన్ని మనం భరించ గలమా.
ఏది నమ్మాడో, అదే చెప్పాడు ఏది చెప్పాడో దాన్నే చేసాడు, అది అందరికీ సాధ్య మయేది కాదు, అందుకే(కొందరి) హృదయాలలో నిలిచాడు.
ఆ కుటుంభం లో ని వారు ఇతనివల్లనే కష్టపడ్డా రనే విషయం నేను ఒప్పుకోను.వారి కి విడిగా వెళ్ళి బాగుపడే స్వేచ్చ తప్పక వుండే వుంటుంది.

Bolloju Baba said...

పై కామెంటు లోని భావాలతో నేను ఏకీభవిస్తాను. చలం ముందునుంచీ స్వతంత్ర్య భావాలను, స్వతంత్ర్య జీవనాన్ని వాంచించాడు. కుంటుంబసబ్యులు స్వతంత్రించి నిర్ణయాలు తీసుకుని స్థిరపడిఉండినట్లయితే చలం తన జీవితకాలంలో సంతోషించేవాడేమో? (ఆయన తాను బాధపడినట్లెక్కడా చెప్పడు. ఈ వ్యాసం చదివినతరువాత విచ్చిన్నమైన తనకుటుంబం పట్ల వేదన చెంది ఉంటాడని అనిపిస్తుంది) ఆ స్వతంత్ర్యతనె ఆయన భోదించాడు, వాంచించాడు రచనలలో బహుసా కుటుంబంలో కూడా అవ్వొచ్చు.

ఆయనను ఒక మామూలు కుటుంబ పెద్దగా వ్యవహరించమనటం లేదా అలా ఆశించటం ఆ కుటుంబ సభ్యుల తప్పిదమేమో?
చలం పట్ల నా ఆరాధన భావాలకు ఘాతం కలిగే లాంటి వ్యాసం చదివాను ఇవ్వాళ.

బొల్లోజు బాబా

Anonymous said...

nobody can not under stand

Post a Comment

  ©THE iNSIDER. Template by Dicas Blogger.

TOPO