Saturday, October 6, 2007

'అతను తిరిగి రాడేం!'

నీ మధుర బంధాలనించి నాకు స్వేఛ్చనివ్వు. యీ ముద్దుల మధువు నాకింక చాలు-చిక్కనైన యీ పరిమళం చిమ్మే ధూపం నా హృదయానికి వూపిరాడనీటం లేదు, తలుపులు తెరచి, ప్రాతఃకాల శోభని లోపలికి రానీ. నీ లాలింపుల బంధనలో వొదిగి నీలో మునిగిపోయినాను- నీ యింద్రజాలం నించి నన్ను విడుదల చేసి నా స్వఛ్చంద హృదయాన్ని నీకర్పించేందుకు నా పౌరుషాన్ని నాకు తిరిగి నాకివ్వు.
*
ప్రియా కళ్ళెత్తి చూడు , అని రహస్యంగా పలికాడు. నేనతన్ని పొమ్మని కసిరాను. కాని అతను కదలలేదు . నా ఎదుట నిలిచి నా రెండు చేతుల్ని పట్టుకున్నాడు- నన్ను వదిలి పొమ్మన్నాను. కాని అతను వెళ్ళలేదు. నా చెవి దగ్గిరకి వొంగాడు. నేను అతని వంక చూసి 'సిగ్గులేదా?' అన్నాను. అతని పెదిమలు నా చెంపల్ని తాకాయి. నేను వొణికి ' మరీ సాహసం చేస్తావు ' అన్నాను. కాని అతనికేం సిగ్గు వున్నట్టు లేదు- నా శిగలో ఓ పువ్వు పెట్టాడు. 'యేం ప్రయోజనం లేద ' న్నాను . అయినా కదలక నుంచున్నాడు.
*
కాలం కరిగింది. నా మెడపై ముద్దుతో పాటు హృదయాన్నీ తీసుకెళ్ళాడు. నేను యేడుస్తో అడుగుతాను 'అతను తిరిగి రాడేం!' అని.

Seja o primeiro a comentar

Post a Comment

  ©THE iNSIDER. Template by Dicas Blogger.

TOPO