Monday, December 10, 2007

ఠాగూరు గారి ఒక గీతానికి స్వేఛ్చానువాదం!

దుమ్ము కొట్టుకుపోయిన బట్టలతో
గోడ వారగా నేలపై
నిద్రతో వొరిగి వున్నాడో యువ యోగి.
ఆరిపోయిన దీపాలు ,
మూసేసిన నగరపు గేట్లు,
నక్షత్రాలన్నీ నల్లని మేఘాలతో
కప్పిన ఆ రాత్రిలో...

హఠాత్తుగా అతని హృదయం వొణికింది.
అడుగులు ఘల్లుమంటో దగ్గిరవతోన్న చప్పుడు.
కలవరంగా కళ్లు తెరిచాడతడు.
ఆమె పట్టుకున్న దీపపు కాంతిలో అతని దయాపూరితమైన కళ్లు మెరిశాయి.
ఆ యువతి నాట్యకత్తె. ఆమె కళ్లు యవ్వనోత్సాహం నింపుకున్నాయి.
దీపపు కాంతిని చిన్నగా చేసి అంది.
' మీ క్షమను కోరుతున్నాను.
యిహ లోకపు సుఖాలన్నింటినీ త్యజించిన యువకుడా!
ధూళి నిండిన యీ పానుపు వీడి అందమైన నా మహలుకు రండి'.
'జవ్వనీ నీ దార్లో వెళ్లిపో .
సమయమొచ్చినపుడు నేను రాకుండా వుండను '.

*

ఆ నగరంపై చంద్రుడు అంతులేని ఆశలను
వెన్నెల్లో గుప్పించి కురిపిస్తున్నాడు.
దారికిరువైపులా చెట్లు తలలూపుతున్నాయి.
యెక్కణ్నించో సన్నని మురళీగానం గాల్లో తేలుతో.
ఆ దేవదారు చెట్ల మీంచి యేవో విషాద పాటలు ప్రవహిస్తున్నాయి.
అందరూ వొదిలేసిన ఆ వొంటరి వీధి వెంబడి
ఆ నగరపు గేట్లను దాటాడు ఆ యువ యోగి.
ఆ నగరపు గోడ నీడలో ఓ స్త్రీ , శరీరంపై మచ్చలతో .
యువకుడు కూచుని ఆమె తలని వొడిలోకి తీసుకున్నాడు.
ఆమె అంది 'దయను కురిపించే మీరు ధన్యులు.
యింతకీ యెవరు మీరు?'

'నీకిచ్చిన మాట ప్రకారం నేను వచ్చాను. '

4 Comentários:

Anonymous said...

baagundhi sridhar .............

oremuna said...

ఇంగ్లీషు/బెంగాలీ ఒరిజినల్ కూడా వ్రాస్తే చాలా బాగుండేది. మీ అనువాదం బాగుంది. ఠాగూర్ బెంగాలీ కవితల్లో లయ ఉంటుంది అని విన్నాను. దాని కోసం ట్రై చెయ్యండి.

ramya said...

బాగుంది.

Bolloju Baba said...

టాగోర్ కవితాత్మ బహు సున్నితంగా పట్టుకొన్నారు.

Post a Comment

  ©THE iNSIDER. Template by Dicas Blogger.

TOPO