చలం స్వాతంత్ర్యసమరంలో ఎందుకు దూకలేదు ? పిరికివాడిగా ఎందుకు మిగిలిపోయాడు ?
యీ ప్రశ్న చెలానికీ, చెలం లైఫ్ స్టైల్ కీ చాలా అసంబద్దంగా తోస్తుంది. నిజంగా యీ ప్రశ్న చెలానికి సంబంధించి యింత అసంబద్దమా? మన స్వాతంత్ర్య పోరాటంలోంచి చెలాన్ని విడిగా చూడటానికి అలవాటుపడ్డామా?
వందల సంవత్సరాలుగా విదేశీయుల చేతుల్లో బానిసలుగా పరమ నీచాతి నీచంగా హేయంగా బ్రతుకుల్ని ఈడుస్తో దాస్యవిముక్తి కొరకు రెండు వందల సంవత్సరాల నుంచి లక్షలాది ప్రాణాల్ని బలిపెడ్తో , విదేశీ ముష్కరాల్తో పోరాడే తరుణంలో చెలం వ్యక్తి స్వేచ్చ గురించి, కుటుంబం గురించి, సంసారం గురించి, సెక్సు గురించి పుంఖానుపుంఖాలుగా రాసుకుంటో పోవడం, తన చూట్టూ వున్న సమాజం స్వతంత్ర్య సమరంలో అట్టుడికిపోతూ వుంటే ఆ జ్వాలల సెగలేవీ చెలానికి తగలలేదా అని చాలా సార్లు ఆలోచించాను. చెలానికి దేశం దుర్గతి స్థితి పట్టలేదా?
అయితే చెలం ఏ ఉబుసుకోక కబుర్లు రాయలేదన్నది నిజం. ఆయన రాసినవేవీ సమాజపు శ్రేయస్సు పరిధి దాటలేదన్నది అంతకన్నా సత్యం. భారత ప్రజానీకం దాస్యశృంఖలాల్తో మగ్గిపోతున్నపుడు వ్యక్తి స్వేచ్చ గురించి , సంసారం గురించి రాసినా వాటి ఫలాలు, నుంచి మన స్వాతంత్ర్యాన్ని సంపాదించినపుడే అనుభవిస్తామన్నది నిర్వివాదాంశం.
చెలం మాటల్లో
'... కాని ప్రజలు చచ్చిపోతున్నారు . నాకు చావంటే భయం లేదు. కాని చావాలని లేదు. జీవితమంటే ప్రేమ నాకు. దేశంలో విశ్వాసం లేదు. . .కాని యీ ఉద్యమం మొదటిరోజుల్లో శిబిరాల్లోని మహోత్సాహాన్ని చూసినపుడు గొప్ప అనుభవాన్ని మిస్ అవుతున్నాననిపించింది. ప్రతికక్షుల న్యాయాన్ని, అబద్దాన్ని చదివినప్పుడు నా రక్తం వుడుకుతుంది... కాని వారివల్ల బాధితులైనవాళ్ళ మీద జాలి అన్నా కలగదు నాకు.’
అయినా చెలానికి యేదోషం అంటగట్టలేం.
అతని పోరాటమంతా అక్షరాల్తో. స్త్రీ కోసం, స్వేచ్చ కోసం, సమాజ శ్రేయస్సు కోసం, పిల్లల కోసం అక్షరాలనే ఆయుధాలుగా మలిచి సమాజంలోని రుగ్మతలపై సైద్దాంతికంగా దాడికి దిగాడన్నది జగమెరిగిన సత్యం
అయితే చెలం పిరికివాడా?
' ...ఇదంతా తన భీరుత్వాన్ని సమర్దించుకోడానికి నా మనసు అల్లుకున్న వేదాంతమేమో? ఇట్లా ఆలోచించుకుంటో నిర్వీర్యుణ్ణిగా వుంటున్నాను. నా యోచన మీకు అర్థమయిందనుకుంటాను. నన్ను ప్రోత్సహించే ఆలోచన ప్రేమ కాదు. పిరికినని నన్ను నేనే నిందించుకోడంవల్ల కలిగే బాధ…’
పేరుకోసం ఉద్యమంలోకి వెళ్ళినవారూ, ఇంటికెదురుగా రక్తపుటేరులు పారుతోన్నా ఇంట్లో కొంగజపం చేసుకోంటో కూర్చున్నవాళ్ళకంటే చెలం యెపుడూ యేనాడూ పిరికివాడూ, అశక్తుడూ కాదు. తన బాధ్యతను యే రూపేణా కానీ సంపూర్ణంగా నేరవేర్చటానికే కంకణం కట్టుకున్నాడు. వెలివేయబడ్డాడు.
స్వాతంత్ర్యసమరం మీదా, దేశభక్తిమీద, గాంధీ మీద, పిరికితనం మీదా, పిపోక్రసీ మీదా చెలం భావావేశాల కెరటాల్ని ఇక్కడ స్పృశించండి పూర్తిగా
3 Comentários:
భలే ఉండి మీ పోస్టు
నాకూ ఒక్కోసారి అనిపించేది. అంత ఉదృతంగా స్వాతంత్ర్యోద్యమం జరుగుతున్న సమయంలో చలం అలా పువ్వులగురించి, మానవసంబంధాలగురించీ స్వేచ్చగురించీ మాట్లాడేడే తప్ప సగటు మధ్యతరగతి ఇంటలెక్చువల్ లా ఉద్యమం పట్ల ఆకర్షితుడవ్వడు.
చాలా చోట్ల ఉద్యమ పోరాటంలో ఉన్న హిపోక్రిసీ పట్ల తన విసుర్లు విసురుతూనే వచ్చాడు.
యోగ్యతా పత్రంలో ఎకానమీ ఆఫ్ వర్డ్స్ అన్ద్ తాట్స్ దేశభక్తి కన్నా హీనం అనటాం, మ్యూజింగ్స్ లో చాలా చోట్ల ఇలాంటి డెక్కరింపులు అనేకం ఉంటాయి.
చలం అనే ఒక ఆలోచనా ఝురి ఉద్యమం, దేశభక్తి, పెళ్లి అనే శృంఖలాలచే బంధింపబడేది కాదేమో.
ఏమో మీ టపా చదివినతరువాత కూడా నాకు క్లారిటీ రాలేదు :-). సరదాగా
కొన్ని విషయాలలో చలం ఎప్పటికీ అర్ధం కాడేమో!
ఈ అంశంపై మరిన్ని విశ్లేషణలను వినాలని ఉంది.
i could not fine post comment option here before. now i got it and i reposted the comment here sorry
Interesting!!!
1920లలో మొదలయ్యి 1940లలో అంతమయిన ఉద్యమం గురించి ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటె అది మనకు చాలా పవిత్రంగానూ, ఎంతో ఉన్నతమైనదిగానూ కనపడుతుంది. కాని అప్పుడు నివసించిన ప్రజలకు ఇది ఒక రాజకీయ ఉద్యమం మాత్రమే. ప్రజలందరూ పాల్గొన్నారా అంటే చెప్పలేము. ఏ టైములో చూసిన ఒక పాతిక శాతం ప్రజలు ఈ ఉద్యమం మీద మక్కువ చూపి ఉంటారు.అంటే ఒకే మనుషులు ఎప్పుడూ ఉద్యమంలో కొనసగలేదని నా ఉద్దేశ్యం. ఆ కారణాన మిగిలిన 75% పిరికి వాళ్ళు అనలేము. వాళ్ళ దృష్టిలో అప్పటి పరిస్థితులలో బ్రిటిష్ వాళ్ళ దగ్గరనుంచి విడిపడటం అవసరం లేదనుకుని ఉంటారు. అలా అనుకునే ధైర్యం వాళ్ళకు ఉన్నది. మనం ఇవ్వాళ కొన్ని దశాబ్దాల తరువాత చాలా రొమాంటిక్ గా ఎంతో దేశ భక్తి ఉద్యమంగా అనుకునేది ఆ రోజుకి ఒక రాజకీయ ఉద్యమమే. మనకు ఇష్టమైన ఉద్యమంలో పాల్గొనని వాళ్ళను పిరికి వాళ్ళు అనుకోవటం కన్న పెద్ద హిపోక్రసీ మరొకటి ఉండదు. చలం తన జీవితం అంతా కూడా అలాంటి హిపోక్రసీనే నిరసించాడు, పోట్లాడాడు, పోరాడాడు. నలుగురు అవునంటే, వాళ్ళేమనుకుంటారో అని అనుకోకుండా, ఆలోచించి, కాదు అనటానికి ఆలోచన, ధైర్యం, రెండూ కావాలి. చలానికి ఆ రెండూ పుష్కలంగా ఉన్నాయని ఆయన జీవితమే ఒక నిదర్శనం.
Post a Comment