Sunday, January 20, 2008

వొక బతికిన క్షణం

వూడిన
గుండీని -దగ్గిరగా చేరి
వూపిరితో తాకుతూ -తిరిగి పెట్టినట్టు

ఆమె

అప్పుడప్పుడూ నేలేనప్పుడు గది గొళ్ళెం మధ్యగా వో చిన్న కాగితం వుంచి వెళ్ళేది.
యీదిరి గాలికి రహదారిపై దారినీ గాలినీ తాకుతూ కొట్టుకువెళ్ళే ఎవరో చింపిపడవేసిన
దుమ్ముకాగితపు వుండలా నేను గదికి చేరుకున్నప్పుడు,
గొళ్ళెం మధ్యగా దాచిన ఆమె దేహం సువాసన కొమ్మల్లో యిరుక్కునేవాణ్ణి.

జాబిలిలోంచి వో తునక తెంపుకు వచ్చినట్టున్న కాగితం పై
కొన్ని మేఘం గండు చీమల్లాటి అక్షరాలు:
'నీ కోసం వచ్చాను. ఎక్కడకు వెళ్ళావు చెప్పకుండా?'
యిన్ని మరిన్ని.

సంవత్సరాల తర్వాత నేను నా గదికి వచ్చి,
అలసటపరుస్తున్న మట్టి కమ్ముకున్న వీధిదిమ్మర కళ్ళతో
ఏ కాగితమూ లేని గొళ్ళెంవైపు చూస్తాను.
బహుశా, ఋతువు మారింది, పగటి మంచు భూకంపపు రోజు రాత్రి లోయగా చీలినట్టు.
బహుశా కోల్పోయినతనం తలుచుకునే అక్షరాలగానూ మారింది.


యీ గొళ్ళెంగూటిలో వొకప్పుడు పొదిగిన అక్షరాలు యిప్పుడెక్కడున్నాయి?

Seja o primeiro a comentar

Post a Comment

  ©THE iNSIDER. Template by Dicas Blogger.

TOPO