జ్ఙాపకాలు !
ప్రపంచానికిదొక అపరిచిత వూరు!
సీలేరు!
భద్రాచలం నుంచి 160 కి.మీ. దూరంలో దట్టమైన అడవుల్లో , ఎత్తైయిన కొండ మీద (1340 అడుగుల ఎత్తున సముద్ర మట్టానికి), ఇంకో పక్క నర్సీపట్నం నుంచి చింతపల్లి అడవులమీదుగా 220 కి.మీ. దూరాన వుంటుంది. అపుడక్కడ నాలుగేళ్లుగా యింజనీర్ గా పవర్ ప్రాజెక్ట్ లో ఉద్యోగం. ఆధ్రా-ఒరిస్సా బార్డర్ అనీ మనం పేపర్లో చూసేది ఇదీ ఒకటే. భౌగోళికంగా మూడు జిల్లాలకు (తూ.గో, ఖమ్మం , వైజాగ్) , మూడు రాష్ట్రాలకు (చత్తీస్ ఘడ్, ఆంధ్ర ప్రదేశ్ , ఒరిస్సా ) లకు వారధి. అక్కడ ఎపిజెన్ కో వారి 4x60 MW పవర్ ప్లాంట్ వుంది.
*
ఆకులు రాలుతో చేసే శబ్దమూ గాలి చేసే సవ్వడి తప్ప యింకా యే మనుషుల అలికిడీ యెక్కువగా లేని యీ వూరు కొలనులో తేలియాడే తామర తాడులా స్తబ్దంగా బద్దకంగా వుంటుంది. భానుడు తన లేలేత ఆశా కిరణాలను , ఆ వూరుని దట్టంగా కప్పిన చెట్లల్లోంచి చొప్పించటానికి ప్రయాసపడే ముందే వూర్లోని ఆంజనేయస్వామి గుళ్లో హనుమాన్ చాలీసా హుషారుగా గాల్లో అలలుగా తేలుతో వూరిని నిద్ర లేపుతుంది. అపుడపుడే వూరు బద్దకంగా వొళ్లు విరుచుకుంటో సోమరిగా నిద్ర లోంచి మేల్కొంటుంది.
ఆ తరువాత సినిమా రీలును ఫాస్ట్ ఫార్వాడ్ చేసినట్టు జీవితం జాగింగ్ లోంచి రన్నింగ్ లోకి పరిగెడుతుంది.. వూర్లో ఒకే సాహెబు కిరాణా కొట్టు, రావు కూరగాయల షాపూ , తమిళ అయ్యర్ టీ బడ్డీ, రమణారావు హెయిర్ కట్టింగ్ సెలూనూ, భారతి బేంగిల్స్ స్టోరూ, అందర్నీ ఒకే చోట కలుపుతాయి. పోలీస్ ఠాణా వొకటి వూరికి పొకిమేరల్లో... కల్మషాలకు దూరంగా గలగలా పారే నది ప్రవాహపు ఉత్సాహాన్ని అడ్డుకట్ట వేసిన ఒక డ్యాం. ఆ డ్యాంలోంచి క్రమబద్దంగా వదిలే నీరు పవర్ హౌజ్ కు వెళ్లి విద్యుత్తు తయారీకి వుపకరించి శబరీ నదితో సంగమమవుతుంది. అదో జీవనదిలాంటిది. సీలేరు నది ఎండిపోవటమనేది అక్కడి ప్రజలు ఎప్పుడూ చూసి ఎరుగరు.
కూరగాయలు పండించుకోంటో, వేటాడుకుంటో నాగరికతకు దూరంగా గిరిజనులు సుమారు 2000 వరకు జనాభా. అణుఒప్పందాలపై రభస జరిగినా, స్టాక్ మార్కెట్లు కుప్పకూలినా, ఐశ్వర్య పెళ్లి చేసుకున్నా, బాంబులతో దేశం ఉలిక్కిపడ్డా ఇక్కడి ప్రజలేమీ తొణకక భానుడు నిప్పులు చెరిగేవేళ చెమట్లు కక్కుతో మట్టిలో పనిచేసి సాయంత్రానికి రెండు చుక్కలు సోమరసాన్ని తాగి ఆటలు పాడుకుంటో నాట్యం చేసి అలసిసొలసి పడుకుండిపోతారు. మర్నాడు అనివార్యంగా మొదలైయే రోజూవారీ యాంత్రిక జీవితానికి శక్తిని సమీకరించుకోంటో ... ఎలక్షన్లపుడు కూడా ఎవరూ తొంగి చూడని వూరది. న్యాయాన్యాలూ, నైతికానైతికాలూ, పాపపుణ్యాలూ, కుట్రలూ కుతంత్రాలూ యింకా ప్రవేశించని బ్రతుకులే యెక్కువ అక్కడ.
మేం 10 యింజనీర్లం అక్కడ. మాకు కొద్దిగా వర్కర్స్ స్టాఫ్. మేమే నాగరికతకూ, నవీన ప్రపంచానికి ప్రతీకలం . అపరిమితమైన ప్రపంచం,లోకజ్ఙానం తెలిసిన మాలో ఏదో అశాంతి. ఆ వూరికీ మిగతా ప్రపంచానికీ మధ్య యేదో గీత!వెలివేత లాంటిది ! యేదో చింత మాలో ! యెందుకు మాలో అంత రెస్ట్ లెస్ నెస్??,అశాంతి???. ప్రపంచానికి దూరంగా వుండి మేమేం కోల్పోతున్నామో, శరవేగంతో దూసుకువెళ్లే ప్రపంచాన్ని అందుకోలేకపోతున్నామనే వేదన.
ఆనందానికి దుఃఖానికి నిర్వచనం మాకు తెలుసు కాబట్టి ఇంత అలజడా మాలో? మరి వీళ్లకు యేం తెలుసని యే అశాంతి లేకుండా జీవితాల్నిలా గడిపేస్తున్నారు.
సరే! మేం ఎలాగో ఎపుడో వెళ్లిపోయి ప్రపంచోత్సవంలో కలుస్తాం. మరి వీళ్లు. ఇక్కడే పుడుతో కొండల్లో ఆడుకుంటో పెరిగి ఇదే మట్టిలోనే కలిసిపోయే వీళ్లకు సంతోషానికి నిర్వచనం తెలుసో లేదో అని చాలాసార్లు ఆలోచించేవాడిని.
***
వీలుంటే మళ్లీ యీ వూరి తో
2 Comentários:
సీలేరు గడ్డలో నేనూ స్నానం చేశా. సీలేరు టూరింగ్ టాకీస్ లో నేనూ సినిమా చూసాను. డొంకరాయి ప్రాజెక్ట్ కూడా చూసాను. డొంకరాయి కాకా హోటల్లో ఊతప్పం తిన్నాను. బద్రాచలం నుండి రోడ్డు ప్రయాణం... కొండలని తాకుతూ మేఘాలు.. నేను వెళ్ళినప్పుడు శబరి బ్రిడ్జి పూర్తీ అయ్యింది. ట్రాఫిక్ ని ఇంకా వోదలలేదు. మేము అక్కడవారిని బతిమాలి దాటాము.. చూడదగ్గ ప్రదేశం. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
m postlu baavunnayi.Konni jnapakaalu alaane gurtu vuntaayi.....
Post a Comment