పోస్ట్ చెయ్యని ఉత్తరం
యిప్పుడు రాత్రి పది ఇరవయ్యి. శివ నేను యింకో కొలీగ్ మాత్రమే గదిలో మిగిలాం. దాదాపుగా మిగతా గదులన్నీ ఖాళీగానే కనబడుతున్నాయి. ఏదో తెలుగు మ్యాగజైన్ లో ప్రశ్నలకు సమాధానాల్ని గట్టిగా చదువుతో శివ నిశ్చబ్దాన్ని బద్దలు చేస్తున్నాడు. రాత్రి ఇంకా చిక్కనవుతోంది. నీకు రాయాలని చాలా రోజుల్నించీ అనుకుంటున్నాను. జీవితంలో అనుకోకుండా భరించలేనంత తీరిక దొరికేసరికి యేం చేయాలో పాలుపోలేకుండా వుంది. నాకు షిప్టు డ్యూటీలు మారాయి. రేపట్నించి రాత్రి షిఫ్టులు. గదిలో యిప్పుడు నేనొక్కణ్ణే మిగిలాను. చీకటిలా నిశ్చబ్దం దట్టంగా పరుచుకుంది. నిద్ర రావటం లేదు. ఉదయం నుంచి మళ్ళీ తప్పించుకోలేని గొప్ప విసుగుకొల్పే దినచర్యే .
ఈ రోజు భద్రాచలం వెళదామనుకున్నాను. రెండు కారణాలు. 1. మార్పు కోసం 2. సంతోష్ (మిత్రుడు) కోసం ప్రార్థించటానికి. దేవుడి అస్తిత్వాన్ని నేను తిరస్కరించినా, ఒకవేళ అదే నిజమైతే నా మిత్రుడికి మేలు జరుగుతుందనే వొక ఆశ.కాని ఆపుకోలేని నా పాడు మద్యాహ్నపు నిద్ర వల్ల సాయంత్రం వరకూ అలానే పడుకుండిపోయాను. ప్చ్ ఈ బద్దకాన్ని యెపుడు వొదిలించుకుంటానో?
యే ఆసక్తీ నింపుకోని రోజులు ఒకదానివెంబడి ఒకటి దొర్లుకుంటోపోతున్నాయి. కలలు మాత్రం రోజూ కంటున్నాను. వీటికి విడిది యెపుడో? నీకిపుడు రాయటానికి నాకస్సలు శారీరకంగా సౌకర్యంగా లేదు.ఎపుడు ఆరిపోతుందో తెలియని కరెంటు బల్బు, సందిగ్దావస్థలో తిరుగుతోన్న సీలింగ్ ఫానూ, తీరని దాహం లాంటిదేదో, సిగరెట్సు కూడా వెలితిగా , కొత్తగా తెలుగు నవల్సు చదవటం ప్రారంభించాను యిక కవిత్వాన్నీ, ప్రియురాలి మనసుని చదవటం ఆపేసి.
యింకేం రాయమంటావ్ చెప్పు. మొదట్లోనే ప్రేమ అంత అందంగా కనిపిస్తుందా తరువాత్తరువాత అంత బాధను పంచుతోంది. నీ ప్రేమను హృదయంతో పంచావు. హృదయంతో కాకుండా ప్రేమను పంచితే యింత బాధ వుండేది కాదేమో? పన్నెండు కొట్టింది వాచీ. యింక పడుకోవాలి. మన యిష్టయిష్టాల్తో పని లేకుండా కొన్ని అలా జరిగిపోవాలి. యింకో రాత్రి యింకో ఉత్తరం. యీ మధ్య రాత్రులతోనే మొదలవుతున్నాయి నా ఉదయాలు.
కొందరి స్నేహితుల ఉనికి గొప్ప ఉత్తేజాన్నిస్తుంది. అది నిజం. ప్రియురాలి కంటే కూడా . చెతి వేళ్లు నొప్పెడుతున్నాయి. యింక ఆపేస్తాను.
[యేవో కొన్ని దుమ్ము పట్టిన పుస్తకాల్ని దులుపుతోంటే పోస్టు చెయ్యని ఉత్తరాలు కనబడ్డాయి. అప్పుడెప్పుడో పదేళ్లకిందట Thermal Power Station లో ఉద్యోగం వొచ్చి కొన్ని నెలలు హాస్టల్లో వున్నపుడు స్నేహితుడికి రాసుకుని బద్దకం వల్లో యింక దేనివల్లో పోస్టు చెయ్యకుండా వున్న ఉత్తరాలు.
అక్షరాలూ కాయితాలూ మసక బారిపోయి జ్ఙాపకాల్లాగా... ]
2 Comentários:
ఆహా అనిపించింది మీ ఉత్తరం చదువుతుంటే. అందులో ఏమీ లేదు.. అందుకే ఇంకా నచ్చింది. "భరించలేనంత తీరక".. చాలా బాగుంది. దుమ్ము ఇంకా దులపండి.. ఇంకా చదవాలని ఉంది.
Nothing motivates like a friend.. agreed!! :-)
చాలా బాగుంది
Post a Comment